యోగ తారావళి
ఆదిశంకరులు అద్వైతజ్ఞాననిధి. అస్తవ్యస్తంగా నూటపదహారు శాఖలతో అల్లాడుతున్న వైదికధర్మాన్ని సరిదిద్ది దానికొక స్పష్టమైన మహనీయుడాయన. వేదములలో ఉన్న జ్ఞానోపనిషత్తులకు ఆయన వ్యాఖ్యానం వ్రాశారు. కానీ యోగోపనిషత్తులను తాకలేదు. బహుశా అవి తర్వాతికాలంలో వచ్చి ఉండవచ్చు. లేదా వాటిని వ్యాఖ్యానించవలసిన అవసరం లేదని ఆయన భావించి ఉండవచ్చు. ఏది ఏమైనా, యోగోపనిషత్తుల జోలికి మాత్రం ఆయన పోలేదు.
కానీ, యోగసాధనను మొత్తం గుదిగుచ్చి 29 శ్లోకములలో 'యోగ తారావళి' అనే చిన్న పుస్తకాన్ని ఆయన వ్రాసినట్లు కనిపిస్తున్నది. ఇవి చూడటానికి 29 శ్లోకములే అయినప్పటికీ మొత్తం యోగశాస్త్రసారమంతా వీటిలో ఇమిడి ఉన్నది. వామనుడు చూడడానికి చిన్నవాడైనా, విశ్వరూపం దాల్చినప్పుడు విశ్వం మొత్తాన్నీ ఆక్రమించాడు. అలాగే, ఈ పుస్తకం చూడటానికి చాలా చిన్నదైనా, 'పిట్టకొంచం కూత ఘనం' అన్నట్లు, భావవిస్తృతిలో చాలా పెద్దది. హఠయోగాన్నీ రాజయోగాన్నీ వాటి సారాన్ని పిండి, అతి తక్కువ శ్లోకములలో చెప్పడం ఆచార్యులవారికే చెల్లింది. ఇంకొకరైతే ఈ పనిని చెయ్యలేరు.