గాయత్రీ రహస్యోపనిషత్

గాయత్రీమంత్రము ఋగ్వేదం (3.62.10) లో మనకు లభిస్తున్నది. సూర్యునిద్వారా లోకమును పోషిస్తున్నది గనుక, సావిత్రీమంత్రమని కూడా దీనికి పేరున్నది. వైదికసాంప్రదాయములో ఎన్నో మంత్రములున్నప్పటికీ, గాయత్రిని మించిన మంత్రం లేదన్నది ప్రసిద్ధి. గానం (జపం) చేసేవాడిని రక్షించే దేవతగా గాయత్రికి పేరున్నది. గాయత్రియంటే ప్రత్యేకమైన దేవత కాదు. పరబ్రహ్మమునకు సాకారరూపమే గాయత్రి. ఈ దేవతకు సంబంధించిన వాఙ్మయంలో ఈ ‘గాయత్రీ రహస్యోపనిషత్తు’ ఒకటి. గాయత్రీమంత్రోపాసకులకు ఈ గ్రంథము చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నది నిశ్చయము. మా ఈ వ్యాఖ్యానము, జిజ్ఞాసువులను సాధనోన్ముఖులను గావిస్తే, మా ప్రయత్నం సఫలమైనదని భావిస్తాము.