తారా స్తోత్రం
ఇది పేరుకు ఒక దేవతా స్తోత్రమే అయినప్పటికీ ఇందులోని ప్రతి శ్లోకమూ, ప్రతి పద్యమూ ఒక అంతరిక తంత్రసాధనా విధానమును తనలో పొందుపరచుకొని ఉన్నది. ఈ విషయమును సూక్ష్మగ్రాహులైన చదువరులు తేలికగా గ్రహించగలరు. ఆ కోణంలో గమనిస్తే, ఈ చిన్ని పుస్తకం ఎన్నో రహస్య తంత్రసాధనల సమాహారంగా గోచరిస్తుంది. జగన్మాత అనుగ్రహానికి పాత్రులయ్యే దారులు చూపిస్తుంది.
అవతార పురుషుల, మహనీయుల మాతృమూర్తులను పూజించే ఆచారం ప్రతిదేశంలోనూ ప్రతి మతంలోనూ ఉన్నప్పటికీ, సాక్షాత్తూ భగవంతుడినే మాతృమూర్తిగా ఆరాధించే విధానం మన భారతదేశపు ప్రత్యేకత. దైవాన్ని తండ్రిగానూ పూజింపవచ్చు. తల్లిగానూ పూజింపవచ్చు. రెండవ విధానంలో చనువు, సౌలభ్యతలు ఎక్కువగా ఉంటాయి. కనుక దైవాన్ని మాతృమూర్తిగా ఉపాసించే ఆచారం మన దేశంలో అతిప్రాచీన కాలం నుంచీ ఉన్నది. అలాంటి ఉపాసనలలో విశిష్టమైనట్టిది శ్రీవిద్యోపాసన. ఒకే దైవం జగజ్జననిగా ఆరాధింపబడేటప్పుడు, ఆయా సాధకుల ఉపాసకుల వ్యక్తిగత తత్త్వములను బట్టి, వారివారి మానసిక సంస్కారములను బట్టి సాధనా మార్గములో వారివారి దారులను బట్టి ఎన్నో రకాలైన పేర్లతో విరాజిల్లుతూ వారిని ఆయా రూపములలో కరుణిస్తూ ఉంటుంది.