పతంజలి యోగసూత్రములు
ఆధ్యాత్మికప్రపంచంలో మనకున్న వారసత్వ జ్ఞానసంపద ఏ ఇతరదేశానికీ ఏ ఇతరజాతికీ లేదు. కానీ మన దురదృష్టమేమంటే, మన ప్రాచీన గ్రంధాలలో ఏముందో మనకే తెలియదు. దీనికి కారణాలు అనేకం. సంస్కృతం పరాయిభాష అయిపోవడం ఒకటి, మన మతంపైన మనకే నమ్మకం లేకపోవడం మరొకటి, ఒకవేళ నమ్మకం ఉన్నప్పటికీ, అందులో ఎంతెంత విజ్ఞానసంపద ఉన్నదో తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేకపోవడం మరొకటి, ఉన్నదానిని ఉన్నట్లుగా శుద్ధంగా చెప్పే గురువులు లేకపోవడం ఇంకొకటి, పరాయిమతాల దుష్టప్రచారం ఇంకొకటి – ఇలా కారణాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరేది చెబితే దానిని గుడ్డిగా నమ్ముతూ దొంగగురువుల వలలో పడుతున్న అభాగ్యులు వేలూ లక్షలలో ఉన్నారు. పరాయిమతాల ప్రచారాలు నమ్ముతూ మతం మారుతున్న వారు కూడా అలాగే ఉన్నారు. మనకున్న జ్ఞానసంపద ఏమిటో అర్ధమైతే ఈ దురవస్థ ఉండదు. అలాంటి సంపదలో ఈ గ్రంధం తలమానికమైనట్టిది.
వ్యాసమహర్షి, శంకరులు, వివేకానందస్వామి, ఇంకా ఎందరో మహనీయులు, పండితులు, ఈ ప్రాచీన గ్రంధమునకు వ్యాఖ్యానం చేసి ఉన్నారు. అతి గహనమైన ఈ గ్రంధమునకు ఇంత సరళమైన, సమగ్రమైన వ్యాఖ్యానం ప్రపంచ చరిత్రలోనే ఇంతవరకూ రాలేదని సవినయంగా చెబుతున్నాము. జగజ్జనని కాళి అనుగ్రహమే ఈ అదృష్టానికి కారణం.