శ్రీ మాలినీ విజయోత్తర తంత్రము
పరమశివుని పరబ్రహ్మముగా ఉపాసించే విధానమే శైవసిద్ధాంతము. దీనిలో ద్వైతము, అద్వైతము రెండూ ఉన్నాయి. తంత్రములలో ఆగమములు, నిగమములని భేదం ఉన్నది. శివుడు పార్వతీదేవికి వివరించినవి ఆగమములు కాగా, దేవి శివునకు వివరించినవి నిగమములు. ఈ తంత్రము ఆగమమే అయినప్పటికీ, శివుడు పార్వతీదేవికి చెబుతూ ఉండగా, కుమారస్వామి విని, దానిని సనక సనందనాది మహర్షులకు బోధించినట్లుగా చెప్పబడినది.
శివాద్వైతము, పరమేశ్వరాద్వయ సిద్ధాంతమని చెప్పబడే శైవసాంప్రదాయమునకు త్రికశాస్త్రమని పేరు. త్రికశాస్త్రములో శివ, శక్తి, నర తత్వములన్నవి ప్రసిద్ధములు. దీనిని నేడు కాశ్మీరశైవమని అంటున్నారు. దీనికి మూలమే శ్రీ మాలినీ విజయోత్తరమనే ఈ తంత్రము. అద్వైతవేదాంతము కంటే కూడా ఈ సిద్ధాంతము ఉన్నతమైనదని కాశ్మీరశైవులంటారు. దీనినాధారం చేసుకుని తన తంత్రాలోకము, తంత్రసారములను రచించినట్లు అభినవగుప్తులవారు వ్రాసినారు.